తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. ఈ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కలెక్టర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రి సర్వే చేపట్టబోయే వాళ్లకు సర్వే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు సేకరిస్తారన్నారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కర్ అంటించి, తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే నిర్వహిస్తారని, ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని తెలిపారు. సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లను నియమించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకు పైగా ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఈ సర్వే ద్వారా అందిన వివరాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ఎలాంటి జిరాక్సు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డు వివరాలు కూడా కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.