రైతుల‌కు గోస త‌ప్ప భ‌రోసా లేదు

తెలంగాణ‌లో కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు గోస త‌ప్ప భ‌రోసా లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యాసంగి పెట్టుబడి సాయానికి కూడా పాతరేస్తారట అంటూ మండిప‌డ్డారు. దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా అని నిల‌దీశారు. రేవంత్ ఏడాది ఏలికలో…తెలంగాణ రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేద‌న్నారు. వానాకాలం పెట్టుబడి సాయానికి మోక్షం లేద‌ని, యాసంగి రైతుభరోసాకు దారే కనిపించడం లేద‌ని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ పేరిట దగా చేశార‌న్నారు. ఇక రైతుబంధును కూడా ఎత్తేస్తారా అని అనుమానం వ్య‌క్తం చేశారు. ఇలాగైతే తెలంగాణలో సాగు సాగేదెలా అని, ఏడాదిలోనే బక్క చిక్కిన రైతు బతికేదెలా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేద‌ని, చేతకాని హామీలు ఇవ్వడమెందుక‌ని, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశార‌ని, సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చార‌ని విమ‌ర్శించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *