– లడ్డూ వ్యవహారంలో పవన్ పై కేఏ పాల్ కంప్లైంట్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈ మధ్య ప్రతి తాజా రాజకీయ పరిణామంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు, తిరుమల లడ్డూ వ్యవహారం, కొండాసురేఖ, నాగార్జున పంచాయతీలపై స్పందించిన కేఏ పాల్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ వంద కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వ హయాంలో లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్‌లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్ 8 ప్రకారం పవన్ ను వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని, లేదా పవన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్ సినిమాల్లో లాగా ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతున్నాడని విమర్శించారు. గతంలోనే ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్ జస్టిస్, సీబీఐ పవన్ కల్యాణ్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.