ముగిసిన పండుగ.. ప‌ట్నానికి బ‌య‌ల్దేరిన ప‌బ్లిక్‌

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ ద‌స‌రా వేడుక‌లు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల‌కు సెలవులు కూడా అయిపోయాయి.దీంతో పండుగ కోసం సొంత ఊళ్ల‌కు వెళ్లిన ప్ర‌జ‌లు మ‌ళ్లీ హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారు. దీంతో టోల్ గేట్ల వ‌ద్ద భారీ ర‌ద్దీ నెల‌కొంది. కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. పలు అదనపు కౌంటర్ల ద్వారా పంపినప్పటికీ వాహనాల రాకపోకలు విపరీతంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉదయం నుంచి ట్రాఫిక్ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, నల్గొండ జిల్లా కేతేపల్లి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పంతంగి టోల్‌గేట్ వద్ద 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా వాహనాలను హైదరాబాద్ వైపు పంపించారు. సాధారణ రోజుల్లో 30 వేల నుంచి 35 వేల వాహనాలు తిరుగుతున్నాయని, దసరా పండుగ సందర్భంగా 50 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని టోల్ గేట్ నిర్వాహకులు తెలిపారు.బీబీనగర్ మండలం గూడూరు, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ , నార్కట్‌పల్లి-అద్దంకి, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై టోల్ గేట్ వద్ద ఆదివారం కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *