హీరో , విలన్ పాత్రలతో సంబంధం లేకుండా అద్భుతమైన నటనతో అన్ని సినీ ఇండస్ట్రీల్లో రాణిస్తున్న నటుడు రానా దగ్గుబాటి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో కూడా చాన్సులు కొట్టేస్తున్నాడు రానా. పాత్ర ఎలాంటిదైనా తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. సింగిల్ హీరోగా చాన్సులు అంతగా రానప్పటికీ రానాకు మంచి పాత్రలే దక్కుతున్నాయి. హీరోగా కంటే విలన్‌గానే రానా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులోనూ బాహుబలి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ సినిమాలో భల్లాల దేవగా రానా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన రజినీకాంత్ వెట్టయాన్ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే రానా మరోసారి రాజమౌళి సినిమాలో చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విలన్ పాత్రకు రానాను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రానా ఆఫ్రికాలోని ఓ తెగకు చెందిన నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఆయన గెటప్, పాత్ర , నటన వేరే లెవెల్లో ఉంటాయని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రాజమౌళి నిర్వహించే వర్క్‌షాప్‌లకు కూడా రానా హాజరవుతున్నాడని సమాచారం. దీనికి సంబంధించి మూవీ టీం త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తుందని తెలుస్తుంది.