ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1,062 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరో వైపు ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.