స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో అసభ్యకరంగా డ్యాన్స్ చేయడంపై తెలంగాణ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాతో బాలకృష్ణ చేసిన ఓ పాటలో అసభ్య కరంగా డ్యాన్స్ చేశారంటూ పలువురు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద నేతృత్వంలో పరిశీలించారు. దీనిపై కమిషన్ చైర్మన్ స్పందిస్తూ తెలుగు సినిమా ఇండ్రస్ట్రీని హెచ్చరించారు. సినిమాల్లో మహిళలను అసభ్యంగా చూపించే కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నిర్మాతలు, కొరియోగ్రాఫర్లకు సూచించారు. దీంతో పాటు ‘రాబిన్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్ ప్రైజు’ పాటలో ఉన్న అసభ్య నృత్యాలను తొలగించాలని మహిళా కమిషన్ నిర్మాతలకు సూచించింది. ఇలాంటివి కొనసాగిస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సన్నివేశాలపై సినిమా విడుదలైన సమయంలో సైతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.