ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సొరకాయలపేటకు చెందిన హేసానుల్లా, దిల్‌షాద్, వల్లి, సదుం మండలం, నెల్లిమంద గ్రామానికి చెందిన బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు సోమవారం రాత్రి రాయచోటిలో వారి బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వల్లి, బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ హేసానుల్లా, దిల్‌షాద్, సారాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.