పత్తి కొనుగోళ్లపై, రైతులకు మద్దతు ధర ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తెల్ల బంగారం తెల్లబోతోందని, బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదని పేర్కొన్నారు. సీసీఐ కొర్రీలు పెట్టి.. సాకులు చూపెట్టి పత్తి కొనుగోళ్లను నిలిపేసిందన్నారు. రైతన్న ఆగమైతుంటే.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదని ఎద్దేవా చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుందని విమర్శించారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి అని, కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ, శ్రద్ధ లేవని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధి లేదని మండిపడ్డారు. ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని, సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారని, పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ద్రోహి కాంగ్రెస్ అని, రైతు డిక్లరేషన్ బోగస్ అని విమర్శించారు.