Site icon

అమెరికా ఉపాధ్య‌క్షుడిగా తెలుగు వారి అల్లుడు!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న రెండో సారి అమెరికా అధ్య‌క్ష ప‌దవిని అలంక‌రించ‌నున్నారు. ఇక అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌విని అధిరోహించ‌బోయే వ్య‌క్తి తెలుగు ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష పదవి చేప‌ట్ట‌బోయే రిపబ్లికన్‌ నేత జేడీ వాన్స్‌ తెలుగింటి అల్లుడు. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారు. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం. ఉషాబాల భ‌ర్త‌ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నివడంపై వడ్లూరు గ్రామ‌స్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయ రిటైర్డ్ తెలుగు ప్రొఫెస‌ర్‌ శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూర్వీకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలు సహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్‌ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్‌ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీం కోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్‌ వర్సిటీలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్‌ సంస్థలో పని చేశారు. ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్‌ ఇంజినీర్‌. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. యేల్‌ లా స్కూల్‌లో ఉషా, వాన్స్‌ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే వీరి పెళ్లి జ‌రిగింది. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్‌ ఉన్నారు.

Share
Exit mobile version