అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల నాగార్జున ఈ పెళ్లి గురించి మాట్లాడుతూ.. చైతన్య, శోభితాలు పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తనకు కాబోయే సతీమణి, నటి శోభితా ధూళిపాళ్ల పై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఇంకా నాగచైతన్య మాట్లాడుతూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్, సంప్రదాయబద్ధంగా జరగబోతుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదు. ప్రస్తుతం ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగబోతుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ఇక శోభితాతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు.