హెచ్‌సీయూ భూముల వేలం కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనిపై స్పందించారు. పర్యావరణాన్ని నాశనం చేయొద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మి ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తాను రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై వ్యతిరేకంగా ఈ వీడియో చేయటం లేదన్నారు. ఎక్కడా ఎవ్వరికి వ్యతిరేకం కూడా కాదన్నారు. హెచ్‌సీయూలో జరుగుతున్న ఘటన అందరికీ తెలిసిందేనని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలు చూసి మాట్లాడుతున్నట్లు చెప్పారు. తాను తన అపార్ట్మెంటులో కూర్చుని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కూడా ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగింపబడ్డాయో తనకు తెలుసన్నారు. కానీ అక్కడ జరుగుతున్నది చూస్తే పక్షులు, నెమళ్లు, జంతువులు చాలా ఇబ్బందిపడుతున్నాయన్నారు.రాబోయేది అత్యంత వేసవికాలం అని, అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. వాటి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పక్షులు, జంతువులకు పునరావాసం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆవిస్తున్నట్లు తెలిపారు.