ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ తారలు, ప్రేక్షకులు, ఏఆర్ రెహమాన్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు విడిపోతున్న ఘటనలు చాలా చూస్తున్నాం. తాజాగా జయం రవి, అంతకంటే ముందు ధనుష్ విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకుల సంగతి మీడియాలో, సోషల్ మీడియాలో ముందుగానే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఏఆర్ రెహమాన్ విషయంలో మాత్రం చాలా సడెన్‌గా విడాకుల ప్రకటన వచ్చింది. తన భార్య నుంచి విడిపోతున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు.తమ వైవాహిక బంధం ముప్పై ఏళ్లకు చేరుతుందని భావిస్తున్న తరుణంలో, అనుకోకుండా వైవాహిక బంధానికి ముగింపు పలకాల్సి వస్తోందంటూ పోస్టు చేశారు. ఇక రెహమాన్ విడాకులపై ఆయన తనయుడు అమీన్ స్పందించాడు. తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు. దీనిపై సైరా లాయర్ కూడా స్పందించాడు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నా, కొన్ని పరిస్థితులు, ఇంకొన్ని ఇబ్బందులు, మరెన్నో ఉద్రిక్తతలు వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయన్నారు. 1995లో ఏఆర్ రెహమాన్-సైరాబానులకు పెళ్లి జరిగింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఇక వీరి విడాకులకు కారణాలు ఏమై ఉంటాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.