కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తల్లి సరోజ ఇటీవల కన్ను మూశారు. దీంతో సుదీప్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తల్లితో ఉన్న జ్ఞాపకాలను తల్చుకుంటూ సోషల్ మీడియాలో సుదీప్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. `నన్ను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా, నా జీవితానికి ఓ అర్థం ఇచ్చింది అమ్మ. ప్రతీ క్షణాన్ని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసింది. మనిషి రూపంలో ఆమె నా దేవత. ఆమె నా పండగ.ఆమె నా గురువు. నా శ్రేయోభిలాషి. నా మొదటి అభిమాని. నా ప్లాప్ సినిమాల్ని సైతం ప్రేమించింది. అలాంటి తల్లి ఇప్పుడు ఓ జ్ఞాపకంగా మారిపోయింది. నా బాధను చెప్పేందుకు మాటలు రావడం లేదు. తను లేదు అన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోతున్నా. అంతా శూన్యంగా ఉంది. ఒక్క రోజులో అంతా మారిపోయింది. అమ్మ నాకు ప్రతీ ఉదయం మెసెజ్, కాల్ చేస్తుంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తుంది. అలా నాకు అక్టోబర్ 18న చివరి మెసేజ్ వచ్చింది. అక్టోబర్ 19న మెసేజ్ వచ్చిందా? లేదా? అన్నది నేను చూడలేదు. అప్పుడు నేను బిగ్ బాస్ సెట్ లో ఉన్నా. చాలా కాలం తర్వా నా తల్లికి నేను మెసేజ్ చేయకుండా ఉన్నది ఆ రోజే. ఆ తర్వాత ఫోన్ చేసి అంతా ఒకేనా అని అడగాలనుకున్నా. కానీ బీబీ టీమ్ తో చర్చలతో సాధ్యం కాలేదు. కాసేపటికి స్టేజ్ మీదకు వెళ్లాను. ఆ కాసేపట్లోనే ఆసుపత్రిలో చేర్చారని వార్త వచ్చింది. కాసేటికే స్టేజ్ మీద ఉండగానే కండీషన్ క్రిటికల్ అనే మెసేజ్ వచ్చింది. ఏం చేయలేని నిస్సహాయుడినయ్యా. శనివారం ఎపిసోడ్ కాబట్టి చాలా విషయాలు డీల్ చేయాలి. కానీ నా బుర్రలో అమ్మ ఆలోచనలే. అయినా షూట్ ముగించా. ఎందుకంటే? పనిపట్ల శ్రద్ద, భక్తి, అంకిత భావం ఉండాలని నేర్పింది అమ్మనే. నేను ఆసుపత్రికి వెళ్లే టైమ్ కి అమ్మ వెంటిలేటర్ మీద ఉంది. అది చూసి తట్టుకోలేకపోయా. చివరికి చావుతో పోరాడి ఓడిపోయింది. కొన్ని గంటల్లోనే అంతా అయిపోయింది. ప్రేమగా పిలిచే అమ్మ లేదని నన్ను నేను సముదాయించుకున్నా. ఇక హాయిగా విశ్రాంతి తీసుకో అమ్మా నీ దీపు` అంటూ సుదీప్ చేసిన పోస్టుకు ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.