తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఇప్పుడు పుష్ప-2 కోసం ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు జాతీయ అవార్డులు సైతం వరించాయి. ఇక పుష్ప 2 షూటింగ్ ఈ మధ్యే పూర్తయ్యింది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లు మొదలెట్టేసింది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో పుష్ప టీం పర్యటిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా ప్రకటించారు. నవంబర్ 30న శనివారం ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఈవెంట్ చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. అనుమతులు రాలేదని, అసలు హైదరాబాద్‌లో ఈవెంట్ చేయట్లేదని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ సినిమా నుంచి వరుగా పాటలు విడుదల చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5న 12,000 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.