బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ విష్ణు ప్రియకు పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. గురువారం ఉదయం విష్ణు ప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఆమెతో పాటు ఆమె అడ్వకేట్ కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అడ్వకేట్ సమక్షంలో పోలీసులు విష్ణు ప్రియను సుమారు 40 నిమిషాల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు. విష్ణు ప్రియ మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికి భారీ స్థాయిలో డబ్బులు తీసుకున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమె ఫోన్ సీజ్ చేశారు. విష్ణు ప్రియ స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి దాదాపు 25 మంది సెలబ్రెటీలపై కేసు నమోదవగా మరికొంత మందిని విచారించాల్సి ఉంది.