ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తన కోట్లాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కాలంలో సినిమాలు చాలా వరకు తగ్గించిన బ్రహ్మానందం అప్పుడప్పుడు సినీ కార్యక్రమాలు, ఫంక్షన్లలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మానందం సోషల్ మీడియాలో లేకపోయినా నిత్యం ఆయన మీమ్స్ ప్రతి రోజు లక్షల్లో వైరల్ అవుతుంటాయి. ఈ విషయం గురించి బ్రహ్మానందం కూడా పలు వేదికల్లో చెప్పారు. ఆయన మీమ్స్ చూసి ఆయనే ఎంతో నవ్వుకుంటానంటూ బదులిచ్చారు. ఇక బ్రహ్మానందం ‘Yourbrahmanandam’ అనే ఐడీతో ఇన్‌స్టా ఖాతా తెరిచారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి ‘బ్రహ్మానందం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఇన్ స్టా సంగతి బయటపెట్టారు. ఇక విషయం తెలుసుకున్న బ్రహ్మానందం ఫ్యాన్స్ టకాటకా ఆయనకు ఫాలో కొట్టేశారు. ఇప్పటి వరకు సుమారు 2.15 లక్షల మంది ఫాలోవర్లు వచ్చేశారు. బ్రహ్మానందం మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. అంతే కాకుండా ఆయన పోస్టులు కూడా ఏమీ పెట్టలేదు.