హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట చౌరస్తాలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోఫా, తలుపులు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఫ్యాక్టరీలోని కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ మంటలకు ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదైపోయాయి. షార్ట్ సర్క్యూట్ ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.