ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో దారుణం జరిగింది. అప్పుల బాధతో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాండూరు మండలం కాసిపేట గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొండయ్య షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. దీంతో భార్యా పిల్లలతో కలిసి మంగళవారం కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. తర్వాత ఇంటి నుంచి అరుపులు వినపడటంతో చుట్టుపక్కల వారు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొండయ్య, అతని భార్య శ్రీదేవి, కుమార్తె చైతన్య ప్రాణాలు కోల్పోయారు. మొండయ్య కుమారుడు శివప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.