కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్‌తో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజ ఫుడ్ పాయిజన్‌కు గురైంది. విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థిని చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామమైన వాంకిడి మండలంలోని దాబాకు తీసుకెళ్లగా ఆమె బంధువులు అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని కిందకి దించనివ్వకుండా అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వపరంగా హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని దించేది లేదని నిరసనకు దిగారు. కలెక్టర్ హామీతో విద్యార్థిని మృతదేహాన్ని ఇంటి వద్దకు అనుమతించారు. విద్యార్థిని మృతితో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మీడియాను, సామాన్యులను గ్రామంలోకి అనుమతించడం లేదు.