ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ సోదరుడు, జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కీలక పదవి ఇచ్చే చాన్స్ ఉందని అంతా అనుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు ఏపీ మంత్రి వర్గంలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 స్థానాలు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో జనసేన నుంచి నలుగురికి అవకాశం ఇస్తామని చెప్పి, ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. మరో స్థానం ఇవ్వాల్సి ఉండగా ఆ స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేసేందుకు నిర్ణయించారు. దీంతో పాటు ఏపీ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని ఎంపిక చేయాలని కూటమి అధిష్ఠానం నిర్ణయించింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య ఎంపికయ్యారు.