దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయన్న చర్చ నడుస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో మాత్రం ఎన్నికలు 2029లోనే జరుగుతాయన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రావని వెల్లడించారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలే వస్తే 2026-27లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మాజీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఇచ్చారనే అంశంపై న్యాయ సలహా తీసుకుని స్పందిస్తామన్నారు. విజన్-2047ను కింది స్థాయి వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నామ, విజన్ 2047 కోసం నిధుల సమీకరణకు వినూత్న పంథాలో ముందుకు వెళ్తామని చెప్పారు.