ఏపీలో ఫీ రీయింబర్స్ మెంట్ విషయంలో కూటమి సర్కార్ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫీ రీయింబర్స్ మెంట్ పథకంపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వైయస్ షర్మిల ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. వైయస్ఆర్ మానస పుత్రిక ఫీ రీయింబర్స్ మెంట్ పథకం అని, ఆయన పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం ఇదని పేర్కొన్నారు. ఈ పథకంతో పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేశారన్నారు. నాడు ఫీ రీయింబర్స్ మెంట్ పథకాన్ని వైయస్ఆర్ అద్భుతంగా అమలు చేస్తే వైసీపీ పాలనలో పథకాన్ని నీరు గార్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం అని, ఫీ రీయింబర్స్ మెంట్ విషయంలో సీఎం చంద్రబాబు స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.