ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్‌పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా అని ప్రశ్నించారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా అని నిలదీశారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని అన్నారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదన్నారు. రూ.2.49 రేటుకు ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు. అదానీతో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని , రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం కూడా చరిత్ర అని ఎద్దేవా చేశారు.