మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్ల జోలికొస్తే వాళ్ల ఇండ్లకు తమ ప్రాణాలు అడ్డుపెడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మూసీ బాధితుల ఇండ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చేందుకు సిద్ధమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతల ఇండ్ల జోలికి వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం, రాష్ట్ర మంత్రులు మూసీని విదేశాల్లోని నదుల్లా మారుస్తామంటూ లక్షన్నర కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడో ఇతర దేశాల్లో తిరుగుతున్న మంత్రులకు మూసీ బాధితుల వద్దకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు. బీజేఎస్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అనుమతులు ఇచ్చిన ఇండ్లను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కూలుస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు సక్రమమైన నిర్మాణాలు నేడు అక్రమం ఎలా అయ్యాయో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ ముసుగులో కమీషన్లు దోచుకుంటామనంటే ఊరుకునేది లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నామని, మూసీ పరివాహక ప్రాంతంలోని పేద ప్రజల ఇండ్లల్లో ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.