హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద శాంతినగర్ అపార్ట్ మెంట్‌లో లిఫ్టులో ఇరుక్కొని బయటపడ్డ బాలుడు నేడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. గోడే కబర్‌కు చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్నావ్ తన తాతతో కలిసి శాంతినగర్ లో ఓ అపార్టుమెంటులో ఉంటున్న తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అపార్ట్ మెంట్‌లో ఆడుకుంటూ లిఫ్ట్ వద్ద బటన్ నొక్కాడు. ఈ క్రమంలో లిఫ్ట్ స్టార్ట్ అవుతుండగా కాలు లిఫ్ట్ గోడ మధ్యలో ఇరుక్కుపోయింది. గమనించిన కాలనీ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన సిబ్బంది బాలుడిని బయటకు తీశారు. అయితే బాలుడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలుడు చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.