ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయికి చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కనకరాజు శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ సైతం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. అద్భుతమైన నృత్యకారుడు, సాంస్కృతిక దిగ్గజం కనకరాజు మృతి బాధాకరమన్నారు. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన గొప్ప సహకారం రాబోయే తరాలను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేస్తుందని పేర్కొన్నారు. అతని అంకితభావం, అభిరుచి సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైన అంశాలు వాటి ప్రామాణికమైన రూపంలో వృద్ధి చెందేలా చూశాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు.