Site icon

నేరాలు చేయాలంటేనే భ‌యం పుట్టేలా ప‌ని చేయాలి

– పోలీసు సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు

రాష్ట్రంలో నేరాలు చేయాలంటేనే భ‌యం పుట్టేలా పోలీసులు ప‌ని చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్ర‌త్యేక కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం పోలీసులు 24 గంట‌లు ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. రాష్ట్రంలో ఏ ప్ర‌గ‌తి, అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా పోలీసుల‌దే కీల‌క పాత్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం అని, ప్రజా సేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. పోలీసుల‌ సంక్షేమం కోసం ప్రతి ఏడాది నిధులు ఇస్తున్నామ‌ని చెప్పారు. పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం కేంద్రం కూడా ముందుకు వస్తోంద‌ని వెల్ల‌డించారు. పోలీసులపై పెట్టుబడి పెట్ట‌డం అంటే రాష్ట్ర అభివృద్ధికి కోసం పెట్టిన‌ట్లేన‌ని తెలిపారు. నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నపుడు.. పోలీసులు పాత తరం వాడితే పోరాటం చేయటం కష్ట‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు చ‌ర్య‌ల కోసం, రాజకీయ వేధింపుల కోసం పోలీసులను వాడుకున్నార‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ప‌లువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Share
Exit mobile version