టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌ను నేడు ప్రారంభించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మొదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఉండవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడికి రూ.100 చెల్లించి తన సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతోందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. ఇటీవల ఎన్నికల్లో కార్యకర్తల బలంతోనే గెలిచామని గుర్తు చేశారు. సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీ ఎత్తున జరిగేలా చూడాలన్నారు. రూ.100 సభ్యత్వంతో టీడీపీ రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.