ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన ఆడవాళ్లను అగౌరవపరుస్తూ పోస్టులు పెడితే వదిలిపెట్టేదిలేదన్నారు. అలాంగి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని కోసం ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నేడు రాజధాని అమరావతి పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని, అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లపై అనుచిత పోస్టులు పెడితే ఊరుకునేది లేదని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు.