మూసీపై అఖిల పక్షం వస్తే చర్చ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసీ పై అభిప్రాయాలు ఇవ్వాలని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని, ఎలాంటి అభిప్రాయాలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలన్నదే తన అభిమతమని, కేటీఆర్‌తోనే కేసీఆర్ ఉనికి లేకుండా చేశానని వెల్లడించారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానన్నారు.మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం రూ.1,50,000 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. ఈ నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసీని సుందరీకరణ చేయిస్తామని సీఎం వెల్లడించారు. నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభిస్తామని, నవంబర్ లోపు పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.