విధుల్లో మ‌ర‌ణించిన పోలీసుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం

– పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖ‌కు సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీసుల‌ కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ల‌కు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు రూ.కోటి 50 లక్షలు, ఐపీఎస్‌ల కుటుంబాల‌కు రూ.2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాంక్‌ అధికారులను బట్టి వారికి రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో నిర్వహించిన ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అని, వారు ఎవరి ఎదుట చేయి చాపకూడదని చెప్పారు. పోలీసులు హుందాగా, గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్ శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయని, నేర‌స్థుల‌తో పోలీసులు స్నేహ‌పూర్వ‌కంగా ఉండటం స‌రికాద‌న్నారు. బాధితులతో మాత్ర‌మే ఫ్రెండ్లీగా ఉండాల‌ని సూచించారు. పోలీస్ కుటుంబాలు కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. కొంతమంది హైదరాబాదులో శాంతి లేకుండా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు. కార్య‌క్ర‌మంలో తెలంగాణ డీజీపీ జితేందర్ మట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు విధుల్లోనే అమరుల‌య్యారని చెప్పారు. వారికి నివాళులు అర్పించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ప్రవీణ్ అనే కానిస్టేబుల్ అమరుడ‌య్యాడని తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంద‌ని చెప్పారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *