కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలపై ఆయన మాట్లాడారు. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్సు ఇస్తున్నారా? రైతు రుణాలు మాఫీ చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి బోనస్ ఇచ్చి కొంటుందని చెప్పారు. బీజేపీ నేతలు కూడా తమను ఏం చేస్తున్నారని అడుగుతుంటే విచిత్రంగా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్తు ఇచ్చామని, రూ.500 కే గ్యాస్ ఇస్తున్నామని వివరించారు. తమ మీద చార్జిషీట్ కాదని, బీజేపీ వాళ్లు ఇచ్చిన హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.