హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ దంపతులు తమ పిల్లల్ని చంపి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ ఓ లేఖ రాశారు. హబ్సిగూడలో ఈ ఘటన జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాళ్లకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44), కవిత (35) దంపతులు హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో తమ ఇద్దరు పిల్లలతో కలిసి గత కొన్నేండ్లుగా నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ ఓ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేసే వాడు. 2019లో ఉద్యోగం వదిలేశాడు.ఆ తర్వాత రెండేళ్ల పాటు ఊర్లో వ్యవసాయం చేశాడు. కానీ వ్యవసాయంలో ఆశించినంత గిట్టుబాటు కాలేదు. దీంతో కుటుంబ పోషణ కోసం సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో ఇతరులను సహాయం అడగలేదని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. అమ్మా, నాన్న, అన్న మమ్మల్ని క్షమించండి అంటూ లేఖలో రాశాడు. కవిత సైతం లేఖలో అమ్మా, నాన్న క్షమించండి.. అమ్మ బంగారం ముత్తూట్‌లో ఉంది.. అది విడిపించి అమ్మకు ఇవ్వండి. మమ్మల్ని ఊరికి తీసుకొని వెళ్లండి.. ఇంట్లో సామాన్లు అందరికి పంచండి అని లేఖలో రాసింది. కుమార్తె శ్రీత రెడ్డి (15), కుమారుడు విశ్వాన్ (10) లకు విషం ఇచ్చి చంపేసి, అనంతరం చంద్రశేఖర్, కవిత ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.