2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దోషుల అప్పీల్ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దోషుల పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది.
అప్పట్లో సంచలనం…
దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌లో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు చెప్పింది.