కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే మత కలహాలు జరుగుతాయంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలు, హిందువులపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిలో విగ్రహ ధ్వంసం ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని తెలిపారు. ఇంత దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందిని విమర్శించారు. ఇప్పటికీ ప్రభుత్వం అసలైన నిందితులను పట్టుకోలేదన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేస్తే అందులో దుండగలుఉ చొరబడి చెప్పులు విసిరారన్నారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకే వత్తాసు పలికారని, ఎందుకు ఇంత ద్వేషం అని, ప్రశ్నిస్తే మతోన్మాదులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తారా అని ప్రశ్నించారు. ఆలయంలో దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక శాంతియుత ర్యాలీ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి దారుణాలను సహించేది లేదని స్పష్టం చేశారు.