తాను ఏ పార్టీలో ఉన్నా వైయస్ఆర్ కుటుంబం బాగుండాలనే కోరుకుంటానని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ విజయమ్మ ఆస్తుల పంపకాల్లో జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదన్నారు. ఇదే క్రమంలో వీరి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి పలువురు వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై కామెంట్లు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పలువురు వైసీపీ నేతలు తనపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అధికారంలో ఉండగా ఆస్తులు సంపాదించుకొని పార్టీ మారానని మాట్లాడటం సరికాదన్నారు. తన కొడుకు సాక్షిగా వైసీపీ హయాంలో ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాను కానీ సంపాదించుకోలేదని చెప్పారు. అప్పుల పాలైతే తండ్రి, కోడలి ఆస్తులు అమ్ముకొని అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాలన్నీ మాజీ సీఎం వైయస్ జగన్‌కు తెలుసన్నారు. జనసేనలో చేరుతున్నప్పుడు పవన్ తనను ఎన్నికలకు ముందే పార్టీలోకి ఆహ్వానించాలని అనుకున్నట్లు చెప్పారని తెలిపారు.