Site icon

భువ‌న‌గిరిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. శ‌నివారం ఉద‌యం భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్ల‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు పూర్తిగా చెరువులో మునిగిపోవ‌డంతో ఐదుగురు యువ‌కులు నీటిలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని యువ‌కుల మృత‌దేహాలు వెలికితీశారు. మృతులను హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్‌, వంశీ, బాలు, వినయ్‌గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగ‌లగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్‌ నుంచి భూదాన్‌ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో డ్రైవింగ్ చేయ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు గుర్తించారు. భువ‌న‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share
Exit mobile version