కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మరోసారి అశోక్ నగర్ సందర్శించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. రాహుల్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హరీష్ రావు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించింది రాహుల్ గాంధీ, ఆయన కాంగ్రెస్ పార్టీయేనన్నారు. రాహుల్ గాంధీ జీ, మీరు సందర్శించిన ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? అని ప్రశ్నించారు. వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాలలో పది శాతం కంటే తక్కువ పంపిణీ చేయబడిందని, ‘రివాంప్డ్ టీఎస్పీఎస్సీ’ అని పిలవబడేది కేవలం నిజమైన ఉద్యోగ క్యాలెండర్ లేని రీబ్రాండెడ్ టీజీపీఎస్సీ అని, ఇది బదులుగా ‘ఉద్యోగం లేని క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. యువ వికాసం 5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించి మీ ప్రభుత్వం దానిని ‘శోక్ నగర్’గా ఎలా మార్చుకుందో చూడండి అంటూ ఎద్దేవా చేశారు.