తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన పథకాల ఎగవేత కోసమే కుంటి సాకులు చెబుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల హామీలపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రకటనలు ఇవ్వడం కాదని, పథకాలు అమలు చేయాలని హితవు పలికారు. కోతలు, కూతలు కాదని చేతలు కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టారని, ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. పథకాలకు అర్హులను గుర్తించడం కోసం, పథకాల అమలు కోసం మంత్రివర్గ ఉప సంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని గుర్తు చేశారు. ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదని, మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని విమర్శించారు.
అధికారం కోసం అబద్దాలు ఆడి, అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని, వర్షం కురుస్తుందో, లేదో, పంటలకు సాగునీరు అందుతుందో, లేదో, కరెంటు వస్తుందో, లేదో, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో, లేదో తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండని సూచించారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దని, పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దని హితవు పలికారు.