అధికార దాహంతో కాంగ్రెస్ అమ్మనే మార్చేసిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై, కాంగ్రెస్ పరిపాలనపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఇది పాలన కాదు పీడన అని విమర్శించారు. ప్రజల వేదన అరణ్య రోదన అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను చెరబట్టారని, పేదల ఇండ్లు కూలగొట్టారని, రైతు బంధు ఎత్తేశారని, రైతుబీమాకు పాతరేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేశాయన్నారు. అమ్మఒడిని ఆగం చేశారని, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని పేర్కొన్నారు. ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కారని, హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు ఆశాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు సమైక్యవాదుల పంచనచేరి వంచన చేశారని విమర్శించారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మార్చారని, మీరు చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటేనని, తెలంగాణ అన్నీ గమనిస్తోందని, కాలం రాగానే కాటేసి తీరుతుందని వెల్లడించారు.