Site icon

బంగారు బాతును తిస్తే చిప్ప చేతిలో పెడుతున్న‌రు

హైడ్రా తీరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము బంగారు బాతును చేతిలో పెడితే మీరు చిప్ప చేతిలో పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ఓ పోస్టు చేశారు. సంపద పెంచే ఆలోచనలు మావైతే, ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా, పాతవి అమ్మాలన్నా భయమే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని విమ‌ర్శించారు. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కల కలగానే మిగిలిపోతుంద‌న్నారు. నీ మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక, కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాసుల పై నీ కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయంటూ దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ హ‌యాంలో నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు వెలవెలబోయే ప‌రిస్థిది వ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్‌ పది నెలల పాలనలో రాష్ట్రానికి ప్రతి రోజు నష్టమే జ‌రిగింద‌ని ఆరోపించారు. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న దౌర్బాగ్యపు పాలనకు ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ లెక్కలే సాక్షాలు అంటూ కొన్ని వార్త ప‌త్రిక‌ల క‌థ‌నాల‌ను జోడించారు.

రైతుల‌ను ఆదుకోవ‌డం దృష్టి పెట్టండి…
పాల‌కులు రాజ‌కీయ క‌క్ష‌ల‌కు ముగింపు ప‌లికి రాష్ట్రంలోని రైతుల‌ను ఆదుకోవ‌డంపై దృష్టి సారించాల‌ని కేటీఆర్ అన్నారు. దసరాతో పాటు దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా అని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా, ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అంద‌డం లేద‌న్నారు. ప్రభుత్వానికి రైతుల గోస పట్టదా అంటూ మండిప‌డ్డారు. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోళ్ల‌పై ఎందుకు పెట్టర‌ని, రైతులంటే ఎందుకంత అలుస‌ని ప్ర‌శ్నించారు. స‌ర్కార్‌ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నార‌న్నారు. అర్ధించడం తప్ప ఆక్రోషించడం తెలియని అమాయకులైనందుకు రైతులు అలుసైపోయారా అని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో రాక్షస క్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించాల‌ని, దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయవ‌ద్దంటూ సూచించారు.

Share
Exit mobile version