యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువ‌త‌ను నిలువునా మోసం చేసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగాల భ‌ర్తీపై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాద‌న్నారు. యువతకు విలాప‌మే మిగిలింద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసింద‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నార‌ని, 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయికి పోతోంద‌న్నారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలిస్తూ గొప్ప‌ల‌కు పోతున్నార‌ని విమ‌ర్శించారు. ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతేన‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామ‌ని వెల్ల‌డించారు. జాబ్ క్యాలెండర్ జాడ లేద‌ని, రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేద‌ని, కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది కేవ‌లం 12,527 మాత్రమేన‌ని చెప్పారు. కాంగ్రెస్ నేత‌లు అబ‌ద్దాల‌తో కాలం గ‌డుపుతున్నార‌ని, వారి మోసాల‌కు తెలంగాణ జ‌వాబు చెబుతుంద‌ని పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *