భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అనాథాశ్రమంలో పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ప్రభుత్వ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నించడం జరిగింది. వివరాళ్లోకి వెళ్తే.. భువనగిరిలోని బాల సదన్‌లో ఈ నెల 14న రాత్రి ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి డీసీపీఓతో పాటు మరి కొంతమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఓ బాలిక వాష్ రూం వెళ్లింది. బాలిక ఒంటరిగా వెళ్లడం గమనించిన ఓ వ్యక్తి ఆమెను ఫాలో అయి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ తన గదికి వెళ్లిపోయింది.
బాలిక దిగులుగా ఉండటం చూసిన బాలసదన్ సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీశారు. కార్యక్రమానికి వచ్చిన ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తన శరీరంపై గాయాలు చూపించింది. బాల సదన్ సిబ్బంది డీసీపీఓకు సమాచారం అందించారు. డీసీపీఓ సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోకపోగా విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, చెబితే అందరి ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. బాలికను బాల సదన్ నుంచి వలిగొండలోని ఓ ప్రైవేట్ అనాథాశ్రమానికి తరలించారు. ఆదివారం బాధితురాలు ఉన్న వలిగొండ అనాథాశ్రమంలో డీసీపీఓ సైదులు, కౌన్సిలర్ వెళ్లి విచారణ జరపగా బాధితురాలు తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కలెక్టర్ స్పందించి అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు, ఘటనను దాచి పెట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.