సినీ నటులు సమంత, నాగచైతన్య విడాకుల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్, నాగార్జున కొండా సురేఖపై వేర్వేరుగా పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులైన బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేయనుంది. కొండా సురేఖ తనపై చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ ఆమెకు గడువు ఇచ్చారు. ఆమె క్షమాపణలు చెప్పకపోవడంతో కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.