Site icon

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. సంప్రదాయ క్రీడగా చెప్పుకునే టెస్టులను ఆడేందుకు ఆటగాళ్లు, చూసేందుకు ప్రేక్షకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. టెస్టుల తర్వాత అభిమానులు ఎక్కువగా వీక్షించేంది వన్డేలనే. టీ20లతో వన్డే క్రికెట్పై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే. వన్డే ప్రాభవం ఈమధ్య బాగా తగ్గింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లు తప్పితే ఈ ఫార్మాట్ మ్యాచులు పెద్దగా జరగడం లేదు. దీంతో వన్డేలను కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్తో పాటు ఇటు బోర్డుల మీదా ఉందనేది కాదనలేని సత్యం.

2019 ప్రపంచ కప్ తర్వాత నుంచి వన్డేలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతూ వస్తోంది. టీ20లకు అభిమానులు బాగా అడిక్ట్ అయ్యారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, బంగ్లా లీగ్, పాక్ లీగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్రతి దేశం లీగ్స్ నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ ద్వారా క్రికెటర్లకు, బోర్డులకు పెద్ద మొత్తంలో ధనం సమకూరుతోంది. అదే సమయంలో యువ ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. పొట్టి ఫార్మాట్ మ్యాచులు మూడు గంటల్లో ముగుస్తుండటంతో వీటిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. రోజుల తరబడి సాగే టెస్టులు, ఒక రోజు కేటాయించాల్సి వచ్చే వన్డేల కంటే గంటల్లో పూర్తవ్వడం టీ20లకు బాగా కలిసొస్తోంది.

గత వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ నాలుగేళ్లలో పెద్దగా ఓడీఐ మ్యాచులు జరగలేదు. టెస్టులు, టీ20ల నడుమ ఏదో రెండు, మూడు వన్డేలు పెట్టి లాగించేస్తున్నారు. ఈ మ్యాచులకు టెలివిజన్ రేటింగ్స్, వ్యూస్ కూడా తక్కువే ఉండటంతో అన్ని దేశాలు క్రమంగా ఈ ఫార్మాట్కు ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది భారత్లో జరగనున్న వరల్డ్ కప్.. వన్డేల్లో ఆఖరిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తర్వాత వన్డేలను పూర్తిగా తగ్గించేస్తారనే కామెంట్స్ వస్తున్నాయి.

ఓవర్లను కుదించాలి
ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ తర్వాత వన్డేల్లో ఇక వరల్డ్ కప్ ఉండదని పలువురు క్రికెట్ విశ్లేషకులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ ఫార్మాట్ను మరింత ఆసక్తికరంగా మార్చాలంటే మార్పులు చేయక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. వన్డేలను 50 ఓవర్ల నుంచి 40 కుదించాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి లాంటి వాళ్లు కూడా కీలక సూచలను చేస్తున్నారు. ఈ సమయంలో వన్డేల మనుగడపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రవిశాస్త్రి అభిప్రాయానికి ఆయన మద్దతు తెలిపాడు.

అలా చేస్తే కమర్షియల్గానూ కలిసొస్తుంది
వన్డేలు బోర్ కొడుతున్నాయని చెప్పిన సచిన్.. ఈ ఫార్మాట్పై అభిమానుల్లో ఆసక్తిని పెంచేందుకు పలు కీలక సూచనలు చేశాడు. ‘గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులు కూడా జరగలేదు. ఈ విషయంలో తప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బాల్స్ను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు చాలా అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే ఛాన్స్ బౌలర్లకు లభించడం లేదు. దీని వల్ల 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్‌ వరకు వన్డే మ్యాచ్‌ బాగా బోర్ కొడుతోంది. అందుకే టెస్టు మ్యాచుల తరహాలో వన్డే క్రికెట్‌నూ రెండు ఇన్నింగ్స్‌లుగా విడదీసి ఆడించాలి. అప్పుడు మ్యాచ్‌ రసవత్తరంగా సాగడంతో పాటు కమర్షియల్గానూ కలిసొస్తుంది. టాస్, పిచ్‌ పరిస్థితులు రెండు జట్లకూ అనుకూలంగా ఉండాలి’ అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అయితే సచిన్ సూచనలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఆయన చెప్పినవి పాటించాలని కొందరు నెటిజన్స్ అంటుంటే.. మరికొందరు రెండు ఇన్నింగ్స్ లు అయితే టెస్టులే చూస్తామని.. వన్డేలు ఎందుకని అంటున్నారు.

Share
Exit mobile version