రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, ఈ పాలనలో టీడీపీ నేతలు ఏం తప్పులు చేస్తున్నా ఎలాంటి శిక్షలు ఉండవని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు వైయస్ జగన్ గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబసభ్యులను పరామర్శించారు. సహానా తల్లితో మాట్లాడి ఆమెను ఓదార్చారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు. కూటమి రెడ్ బుక్ పాలనకు పోలీసులు కూడా మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందన్నారు. వైసీపీ హయాంలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేదని, దిశ యాప్‌తో నిమిషాల్లోనే స్పందించి సాయం అందేదన్నారు. సహానా మృతికి కారణమైన యువకుడు నవీన్ సీఎం చంద్రబాబుతో ఫోటోలు దిగాడని, స్థానిక ఎంపీతో కూడా సదరు యువకుడికి తత్సంబంధాలు ఉన్నాయన్నారు. యువతిపై లైంగిక దాడి చేసి ఆసుపత్రిలో చేర్చారని ఆరోపించారు. నిందితుడిని టీడీపీ పెద్దలే కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్ పత్రాలను దహనం చేసిన మంత్రి లోకేశ్, వంగలపూడి అనితలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌ను పప్పు అనడంలో ఏం తప్పు లేదన్నారు. వైసీపీ తరఫున ఇటీవల దాడులకు గురైన, మృతి చెందిన బాధిత ఆరు కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.