వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ రేపు బద్వేల్‌లో పర్యటించనున్నారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. వైయస్ జగన్ బుధవారం ఉదయం గుంటూరు నుంచి హెలికాప్టర్ లో బద్వేల్ చేరుకోనున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి పులివెందులకు చేరుకొని, బుధవారం రాత్రి పులివెందులలో బస చేయనున్నారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బాలిక కుటుంబసభ్యులు బద్వేల్‌లోని రామాంజనేయ నగర్‌లో నివాసం ఉంటున్నారు.
బాలికను హత్య చేసిన విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌కు ఇంటర్ చదువుతున్న బాలికతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. విఘ్నేశ్‌కు ముందే పెళ్లి అయినప్పటికీ బాలికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్ చేసి తనను కలవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.కాలేజీ నుంచి బాలిక ఆటోలో బయల్దేరగా.. విఘ్నేశ్ మధ్యలో అదే ఆటో ఎక్కడాఉ. పీపీకుంట చెక్‌పోస్టు వద్ద ఇద్దరూ ఆటో దిగి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. బాలికపై విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. బాలిక కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలవడంతో బాలిక మృతి చెందింది.