తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, నిబంధనలను బ్రేక్ చేస్తే శిక్షలు తప్పవని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్త వేస్తే కేసులు నమోదు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో వ్యర్థాలను రోడ్డు పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు. పరిశ్రమలతోనే తాడిపత్రి అబివృద్ధి చెందిందని, పారిశ్రామికులు అందరూ బాగా చదువుకున్న వాళ్లేనని, పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వ్యర్థాలను రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని చెప్పారు. తాడిపత్రి అభివృద్ధి కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నామని , అందరూ సహకరించాలని చేతులు జోడించి విన్నవించుకున్నారు.