తెలంగాణలో రెండు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే కొమురయ్య గెలుపొందారు. పోలైన మొత్తం 25,041 ఓట్లల్లో 24,144 ఓట్లు చెల్లుబాటయ్యాయి. వీటిలో 897 చెల్లని ఓట్లున్నాయి. 12,073 ఓట్లను గెలుపు కోటా ఓట్లుగా నిర్దారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, సమీప అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182, అశోక్ కుమార్‌కు 2,621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు నమోదయ్యాయి. నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీపాల్ రెడ్డి 11,821 ఓట్లు సాధించారు.